![]() |
![]() |

ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ల ద్వయం నదీమ్-శ్రావణ్‌లో ఒకరైన శ్రావణ్ రాథోడ్ ఇక లేరు. కొవిడ్-19తో పోరాడుతూ హాస్పిటల్‌లో వెంటిలేటర్ మీద ఉన్న ఆయన రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని బాలీవుడ్ డైరెక్టర్ అనిల్ శర్మ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వెల్లడించారు. "వెరీ శాడ్.. కొవిడ్ కారణంగా గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రావణ్ మనల్ని అందరినీ వదిలి వెళ్లిపోయారని ఇప్పుడే తెలిసింది. నాకు ఆయన సన్నిహిత స్నేహితుడు, నాకు కొలీగ్. మహారాజా సినిమాకు ఆయనతో కలిసి పనిచేశాను. ఎప్పుడూ గొప్ప మెలోడీస్ ఇచ్చారు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. మన హృదయాల్లో ఆయన ఎప్పుడూ నిలిచే ఉంటారు. RIP." అని ట్వీట్ చేశారు. శ్రావణ్ వయసు 66 సంవత్సరాలు.
ఇటీవలే ఆయనకు కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యి, హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారనీ, ఆయన పరిస్థితి క్రిటికల్‌గా ఉందనే వార్త చదువుకున్నాం. ముంబైలోని రహేజా హాస్పిటల్‌లో ఆయన అడ్మిట్ అయ్యారు. ఆయన మృతివార్తతో అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. బాలీవుడ్ ఇండస్ట్రీ అంతా షాక్‌కు గురైంది. కొవిడ్ బారిన పడక ముందే శ్రావణ్ డయాబెటిక్ షేషెంట్ అనీ, ఆయనకు గుండె సంబంధిత సమస్యలు కూడా ఉన్నాయనీ ఆయన స్నేహితుడు, పాపులర్ గేయరచయిత సమీర్ తెలిపారు.
1990ల కాలంలో నదీమ్-శ్రావణ్ బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగారు. అనంతర కాలంలో క్లాసిక్‌గా పేరు తెర్చుకున్న 'ఆషిఖీ' సినిమా వారిని టాప్ పొజిషన్‌లో నిలిపింది. సాజన్, ఫూల్ ఔర్ కాంటే, సడక్, దీవానా, దామిని, హమ్ హై రాహీ ప్యార్ కే, దిల్‌వాలే, బర్సాత్, రాజా, రాజా హిందుస్తానీ, పర్‌దేశ్, ధడ్కన్, రాజ్.. ఇట్లా ఎన్ని మ్యూజికల్ హిట్స్ అందించారో! అలాగే పలు బ్లాక్‌బస్టర్ ప్రైవేట్ ఆల్బమ్స్‌ను కూడా వారు రిలీజ్ చేశారు.
సెకండ్ వేవ్ కొవిడ్ దేశవ్యాప్తంగా జనాన్ని భయకంపితుల్ని చేస్తోంది. ఫస్ట్ వేవ్ కంటే ఇది మరింత డెడ్‌లీగా కనిపిస్తూ, ఇన్‌ఫెక్షన్ చాలా వేగంగా వ్యాపిస్తూ వస్తోంది. ఫలితంగా మూడు రెట్ల కేసులు అధికంగా నమోదవుతున్నాయి. సామాన్య ప్రజలతో పాటు అనేకమంది రాజకీయవేత్తలు, సినీ సెలబ్రిటీలు ఈ వైరస్ బారిన పడ్డారు, పడుతున్నారు.
![]() |
![]() |